- బీఆర్‌ఎస్ పాలన మొత్తం దోచుకోవడం.. దాచుకోవడానికే సరిపోయింది : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సుజాతనగర్/కూసుమంచి/ఖమ్మం టౌన్, వెలుగు : బీఆర్‌ఎస్ పాలన మొత్తం దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాల్లో గురువారం పర్యటించిన ఆయన కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ను నమ్మి రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు, మూడోసారి ఆ పార్టీ మాయమాటలను నమ్మకుండా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8.21 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని మండిపడ్డారు. పదవులు కోల్పోయామన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ 3,475 రోజుల పాలనతో పోలిస్తే కాంగ్రెస్ 1,000 రోజుల పాలనలోనే అనేక రంగాల్లో మెరుగైన అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన చాలా పథకాలు ఇప్పటికే అమలు చేశామని, ఇంకా ఒకటి, రెండు పథకాలు మాత్రమే ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన అనంతరం వాటిని సైతం అమలు చేస్తామని చెప్పారు.
అసలు దొర ఫామ్ హౌస్ కు పరిమితమైతే... పిల్ల కాకులు కారు కూతలు కూస్తున్నాయని మండిపడ్డారు. పాలేరు కాంగ్రెస్ కంచుకోట అని, ఇక్కడ మళ్లీ గెలిచేది మూడు రంగుల జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఖమ్మంలో పీఎస్ఆర్ ట్రస్ట్, రైట్ చాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అధికారులు గంగాధర్, పుల్లయ్య, వెంకటరెడ్డి, శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ రామానుజం, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఎదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పొకబతిని అనిత పాల్గొన్నారు.
